చలం మైదానం తెరమీదకి వచ్చేస్తోంది..

చలం రాసిన మైదానం నవల తెరమీదకి రానుంది. వందశాతం తెలుగు కంటెంట్ ని అందిస్తున్న ఆహాలోకి మైదానం అతిత్వరలో వచ్చేస్తోంది. చలం రాసిన ఈ నవల ని ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల తెరమీదకి తీసుకొస్తున్నారు. 1927లో రాయబడ్డ మైదానం 2020లో తెరమీదకి రావడం ఆశ్చర్యమే. దాదాపు వంద సంవత్సరాల క్రితం రాసిన ఈ నవల ఇప్పటి పరిస్థితులకి కూడా సరిపోతుందంటే చలంగారు ఎంత అద్భుతంగా రాసారో అర్థం అవుతుంది.

స్త్రీ స్వేఛ్ఛకై, స్త్రీ అస్తిత్వానికై రచనలు చేసిన చలం గారి రచనల్లో నుండి అద్భుతమైన మైదానం నవలని ఎంచుకుని దాన్ని తెరమీదకి తీసుకురావడం పెద్ద సవాలే. నీది నాది ఒకే కథ సినిమా ద్వారా మానవ సంబంధాల్లోని సున్నితమైన విషయాలని కూడా అద్భుతంగా చూపించిన వేణు ఊడుగుల మైదానం నవలని ఆసక్తికరంగా నిర్మిస్తారన్న దానిలో సందేహం లేదు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందట.