నవ్యాంధ్రకు మూడు రాజధానుల వ్యవహారంపై బోస్టన్ ప్రతినిధులు.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి నివేదిక అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీసీజీ ఎప్పుడు వేశారు..తల తోక ఉందా?. క్లయింట్‌కు ఏది కావాలంటే అది రాసిస్తుంది.. బీసీజీ గ్రూప్ అదే చేసింది. బీసీజీ గ్రూప్‌తో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. రోహిత్‌రెడ్డి చెప్పింది బీసీజీ రాసిచ్చింది. మీకు నచ్చిన విధంగా బీసీజీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికకు విశ్వసనీయత ఉందా?. అజయ్ కల్లాం చెప్పింది రాసిచ్చానని జీఎన్.రావు చెప్పాడు.
తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం సరికాదు. మూడు రాజధానులు చేయడానికి మీకు ఎక్కడిది..?. ఎవర్ని మోసం చేయడానికి హై పవర్ కమిటీ వేశారు..?. బీసీజీ నివేదిక తప్పుల తడక. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మార్చడానికి మీరెవరు..?. అప్పుడు వైఎస్ జగన్ ఒప్పుకున్నారు. అమరావతి ప్రాంతమే రాజధానికి అనుమూలమని శివరామకృష్ణ కమిటీ చెప్పింది. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.