స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్లపై సుమారు మూడు గంటలకు పైగా వాడీ వేడి వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటు చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈనెల 21(గురువారం) ఉదయం 11:30 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో రేపు ఏం తీర్పు ఇవ్వనున్నారనే ఉత్కంఠ నెలకొంది.
ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని కోరింది సీఐడీ. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని స్పష్టమైన ఆధారాలు వున్నాయని అన్నారు పొన్నవోలు. చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశామని, ఆయనను విచారించడం కోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వాదనలు వినిపించింది. అయితే ఆయనను సిట్ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు.