అమరావతి: కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలు దారణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టపగలే తెలుగుదేశం కార్యకర్తలను హతమారుస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో, లేదో అనుమానం కలుగుతోందన్నారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో పట్టపగలే టీడీపీ నాయకులు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో హతమార్చడం దారుణమన్నారు. అసలు వారు మనషులా, నరరూప రాక్షసులా అని ప్రశ్నించారు. ఈ హత్యల వెనక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తముందని ఆరోపించారు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ అధికారపార్టీకి తొత్తుగా మారిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఇటువంటి ఫ్యాక్షనిజం పోకడలతో ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30మంది టీడీపీ కార్యకర్తలను హతమార్చారు. దేశంలో మరెక్కడూ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు లేవు. రాష్ట్రం జరుగుతున్న హత్యాకాండకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులదే బాధ్యత. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. కబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.