జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు . ఐఐటీహెచ్ నివేదిక మేరకు, వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్టు స్పష్టమైందని వివరించారు. 2020లో వచ్చిన 22 లక్షల క్యూసెక్కుల నీటి వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు.
“ఈ వర్షాకాలం పూర్తయితే జగన్ పని కూడా అయిపోయినట్టే. రాష్ట్రానికి జీవనరేఖ వంటి ప్రాజెక్టును విషాదభరితం చేశారు. పోలవరం పట్ల పేకాటలో జోకర్ తరహాలో వైసీపీ పాలకుల వైఖరి ఉంది” అని వ్యాఖ్యానించారు. పుంగనూరులో ప్రజా తిరుగుబాటు చూసే తనను పోలవరానికి అనుమతించారని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల తిరుగుబాటుకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదని ఎద్దేవా చేశారు. కాగా, చంద్రబాబు విపక్ష నేత హోదాలో పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇదే ప్రథమం.