తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా తాను పని చేసిన నాలుగేళ్లలో ఎక్కువ మంది సామాన్య భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించేందుకు తాము కొన్నినిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ఎల్1, ఎల్2, ఎల్3 టికెట్లు రద్దు చేయడం, సామాన్యులకు స్వా మివారి తొలి దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తి నిచ్చాయని సుబ్బారెడ్డి చెప్పారు.
తిరుమల దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వసతి, ఇతర సదుపాయాలు మెరుగుపరచడం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నామని, ఈ రెండు నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. నాలుగేళ్ల పాటు ఛైర్మన్‌గా పని చేసే అదృష్టం ప్రసాదించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, తనకు అవకాశం ఇచ్చిన వైఎస్.జగన్‌మోహన్ రెడ్డికి, టీటీడీ పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి సుబ్బారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు, రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ, రూ.23.50 కోట్లతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం, రూ.3 కోట్లతో శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణం, రూ.3.10 కోట్లతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులు, రూ.9.85 కోట్లతో వకుళామాత ఆలయం వద్ద అభివృద్ధి పనులు, రూ.2.6 కోట్లతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్ల కేటాయింపు, ఎస్వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ.11.5 కోట్ల కేటాయింపు, రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్ల కేటాయింపు, ఎస్వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు, తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ని టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడేళ్లు పొడిగించారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటుకు రూ.1.25 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయించారు.