రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కడప జిల్లా, చాపాడు మండలం, చియ్యపాడులో సాగు మోటారుకు విద్యుత్ సరఫరా చేసే తీగలు తెగిపడి… కాలికి తగలడంతో ముగ్గురు రైతులు మరణించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిగతా చోట్ల విద్యుత్ ప్రమాదాలలో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఒక్కరోజే ఐదుగురిని బలి తీసుకోవడం అత్యంత విషాదకరమని చెప్పారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో విద్యుత్ ప్రమాదాల కారణంగా 675 మంది చనిపోయారని, 143 మంది గాయపడ్డారని చంద్రబాబు తెలిపారు.
ఇదే సమయంలో 681 పశువులు చనిపోయాయని చెప్పారు చంద్రబాబు. ఇవి స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పిన లెక్కలని తెలిపారు. దక్షిణాదిలో ఏపీలోనే విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని… ఇది సిగ్గు చేటని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం తెలుసుని… ఆ మీటర్ల పేరిట వేల కోట్ల స్కామ్ చేయడం తెలుసని… కరెంటు రేట్లు పదేపదే పెంచడం తెలుసని… కానీ ప్రాణాలు తీస్తున్న విద్యుత్ ప్రమాదాలను నివారించడం, అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం తెలియదా? అని మండిపడ్డారు చంద్రబాబు.