ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తంగా సాగుతున్నాయి. అయితే… సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా తన ఛాంబర్లో అత్యవసర టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు చంద్రబాబు. మండలి సమావేశం నుంచి హుటా హుటిన లోకేష్, యనమల సహా ఇతర ఎమ్మెల్సీలను పిలిపించి మరీ చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై ఈ సందర్భంగా చర్చించారు చంద్రబాబు. వైసీపీ సభ్యులు శృతి మించేలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు.
కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని చంద్రబాబు తో అచ్చెన్నాయుడు అన్నారు. స్పీకర్ కూడా మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదన్నారు అనగాని. సభలో జరిగిన పరిణామాలు చూస్తోంటే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు చంద్రబాబు. తన భార్య శీలాన్ని కూడా సంకించే విధంగా సభలో కామెంట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు… టీడీఎల్పీ భేటీలో కళ్లనీళ్లు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు.
అలాగే… తాను మళ్లీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీ లో అడుగు పెట్టబోనంటూ… శాసన సభలో శపథం చేసారు చంద్రబాబు.