రాజధాని రైతుల ఆందోళన 42వ రోజుకు చేరుకుంది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడంలో నిరసన ప్రదర్శనలు ఉధృతంగా జరుగుతున్నాయి. ఇక మీదట ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని రైతులు నిర్ణయింకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సీఎం జగన్‌పై చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ‘మూర్ఖుడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్న చందంగా సీఎం జగన్ తీరు ఉందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
రాజధానిని తరలించ వద్దంటూ రాయలసీమ ప్రాంతం నుంచి అమరావతికి వచ్చిన మహిళలు తమ అభిప్రాయాలను ఆ వీడియోలో వ్యక్తం చేస్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని భావిస్తున్నామని, అందుకే, ఇక్కడికి వచ్చి తమ మద్దతు తెలుపుతున్నామని అనంతపురం జిల్లా గోరంట్ల నుంచి వచ్చిన మహిళ వరలక్ష్మి తెలిపారు. అధికారం చేతిలో ఉందని చెప్పి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి తగదని అన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన కరెక్టు కాదని, అభివృద్ధి చేయాలనుకుంటే ఇన్ని రాజధానులు అవసరం లేదన్నది తన అభిప్రాయంగా చెప్పారు.