40 ఇయర్స్ ఇండస్ట్రీ… చౌరస్తాలో చంద్రబాబు!

చంద్రబాబుకు అధికారపక్షంతో పోరాడటం కంటే… విపక్షాలను అనుసరించడంపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది! అమరావతిపేరు చెప్పి గతంలో జరిగిన వ్యవహారాల వల్ల.. అభివృద్ధిపై ప్రశ్నించలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర వాసుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందేమో అని మూడు రాజధానులపై గట్టిగా నోరు మెదపలేకున్నారు. ఏపీలోని రోడ్ల దుస్థితిపై స్పందిస్తారనుకుంటే… ఆ క్రెడిట్ పవన్ కొట్టేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు దారెటు.. చౌరస్తాలో ఉన్న బాబు రూటెటు?

ప్రస్తుతం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు చౌరాస్తాలో నిలుచుండిపోయారు. అభివృద్ధిపై ప్రశ్నించలేని స్థితికి పడిపోయారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని తనవెనకున్న శక్తులతో ఉద్యమాలు చేయించగలరే కానీ.. విశాఖలో రాజధాని వద్దని చెప్పలేరు. రోడ్ల పరిస్థితిపై జనసేన స్పందిస్తే… తానాతంధానా అనగలరు కానీ.. డీప్ డిస్కషన్ చేయలేరు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతున్నా.. కనీసం ఒక్క నిరసన అయినా తెలపలేరు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడినుంచి టీడీపీ కార్యకర్తలు ఆశించింది ఇది కాదు కదా.

అయితే… మిగిలిన విషయాల్లో తీవ్రస్థాయిలో పోరాడితే… గతవైభవం వెలుగులోకి వస్తుందని భయపడుతున్న చంద్రబాబు… ఇక వినాయకచవితి పండుగపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఇందులో భాగంగా ఈ నెల 10న 175 నియోజకవర్గాల్లోనూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. చవితి పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ఆరోజున ప్రతీ టీడీపీ కార్యకర్త కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఉత్సవాలు చేయాలంట? అదెలా సాధ్యమవుతుందనేది వేచి చూడాలి!

అలాని బాబుగారు ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారనుకుంటే పొరపాటే సుమా…! ఆన్ లైన్ లో వీక్షిస్తారంట! 40ఏళ్ల అనుభవం.. ప్రజాక్షేమం కోరుతూ చెప్పాల్సిన మాట ఇదా? కోవిడ్ కారణంగా భాగ్యనగరానికే పరిమితమైన బాబు చెప్పే మాటలకు.. చేసే పనులకు ఏమైనా పొంతన ఉందా? బాబుగారే ఆత్మపరిశీలన చేసుకోవాలి!