ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉదయగిరి నారాయణ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎస్‌కు రాసిన లేఖ కాపీని డీజీపీకి పంపిన చంద్రబాబు.. పోలీసుల దెబ్బల కారణంగానే దళిత యువకుడు నారాయణ చనిపోయాడని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులు, దళితులు, మైనార్టీలు, మహిళలు, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని పోలీసుల దౌర్జన్యాలు జరుగుతున్నాయని, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ మరణం ఏపీలోని ఒక వర్గం పోలీసుల క్రూరమైన పని తీరుకు నిదర్శనమన్నారు. అధికార పార్టీకి చెందిన వారి ప్రోద్భలంతో పోలీసులు విచారణ పేరుతో నారాయణను జూన్ 17 కస్టడీకి తీసుకుని చిత్ర హింసలకు గురి చేశారన్నారు. అనంతరం 19 జూన్ 2022న, నారాయణ అనుమానాస్పద స్థితిలో తన గ్రామ శివార్లలో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో కనిపించాడని, తనను కస్టడీలోతీవ్రంగా హింసించారని నారాయణ తన కుటుంబ సభ్యులకు ముందుగానే తెలిపాడన్నారు.
నారాయణ పోలీసుల చిత్రహింసల వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోందని, విచారణ పేరుతో నారాయణను అదుపులోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అతని మరణానికి కారణమయ్యారు. పోస్ట్ మార్టం అనంతరం నారాయణ మృతదేహాన్ని కుటుంబ ఆచారాలకు అనుగుణంగా ఖననం చేయాల్సిన ఉండగా దహనం చేశారు. నారాయణ మృతి కేసులో తదుపరి విచారణ వద్దని ఆయన కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. ఈ ఘటనలో పొదలకూరు పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పాత్రపై సమగ్ర విచారణ జరపడం చాలా ముఖ్యం. నారాయణ పోస్ట్‌మార్టం నివేదికను బహిరంగ పరచాలి. నారాయణ కుటుంబానికి 50 లక్షలు ఆర్ధిక సాయం అదించాలి. మొత్తం ఘటనపై జ్యుడిషియల్ విచారణ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలి.