ప్రధాని, లోక్ సభ స్పీకరుకు చంద్రబాబు లేఖలు రాశారు. అల్లూరి 125వ జయంతి వేడుకలు సందర్భంగా పార్లమెంటులో సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించాలని చంద్రబాబు లేఖ రాశారు. భారత స్వాతంత్య్ర 75వ వసంతాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరి సీతారామరాజును స్మరించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు అని లేఖల్లో చంద్రబాబు పేర్కొన్నారు.
2022 జులై 4న భీమవరంలో మీరు చేస్తున్న అల్లూరి విగ్రహ ఆవిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తిండిపోతుందని.. ఈ ఏడాదే అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు ఉండటం ఆనందదాయకమని చెప్పారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం, అల్లూరి 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఆవిష్కరించడం ఎంతో సముచితమని.. సీతారామ రాజు స్వాతంత్ర్యం కోసం చేసిన సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు.
అల్లూరి ఏజెన్సీ ప్రాంత గిరిజనుల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చాడని… నేటికీ అల్లూరి పేరు ఈ ప్రాంత ప్రజలలో మారుమోగుతోందని గుర్తు చేశారు. అల్లూరి సీతారామ రాజు ‘మన్యం వీరుడు’, ‘విప్లవ జ్యోతి’ గా నేటికి ప్రసిద్ధి అని… బ్రిటీష్ ఫైరింగ్ స్క్వాడ్ రామరాజును క్రూరంగా కాల్పులు చేసి చంపేశారన్నారు చంద్రబాబు. కావున తదుపరి ఎటువంటి జాప్యం లేకుండా అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు.