జగన్‌కు పరిపాలన చేతకాదు.. ఆయన వేస్ట్!-ఇదీ టీడీపీ నిర్దారించుకున్న విషయం. కానీ, ప్రజలు జగన్‌ను నమ్మారు. ఆయనకు అధికారం అప్పగించారు. ఏడాదిన్నర పాలనలో నిజానికి ఒక్క రాజధాని విషయాన్ని పక్కన పెడితే.. ఎక్కడా ఎలాంటి ఉద్యమం కానీ, ప్రజా వ్యతిరేకత కానీ, మాకు జీతాలు పెంచాలని కానీ, మా ఉద్యోగాలు పోతున్నాయని ప్రజలు, నిరుద్యోగులు రోడ్డెక్కింది లేదు. పోలీసులు లాఠీలు ఝళిపించింది కూడా లేదు. పైగా లాక్‌డౌన్ సమయంలో కూడా ప్రజలను ఆదుకున్న సర్కారుగా జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు అన్ని విధాలా తన ప్రభుత్వ ఫలాలను అందించారు.
ఇది జగన్‌ను ఉన్నతస్థానంలో నిలబెట్టింది. దీనికే ఆయనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. ఈ పరిణామాలు, జగన్‌పై ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయాలను క్రోడీకరించిన జాతీయ సర్వే.. జగన్ దేశంలోనే నాలుగో ఉత్తమ సీఎం అంటూ కితాబునిచ్చింది. అయినప్పటికీ.. టీడీపీ తన పద్ధతిని మార్చుకోవడం లేదు. కోర్టుల్లో జగన్ ఓడిపోతున్నారని, ఆయనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని.. సో.. జగన్ వేస్ట్ అని ప్రచారం ప్రారంభించింది. దీనికి టీడీపీ అనుకూల మీడియా వంత పాడడం తెలిసిందే. కానీ, నిజానికి కోర్టుల్లో కేసుల గెలుపు ఓటములను బట్టే.. పాలన చేతనవుతుంది? చేతకాదు..? అనే తీర్మానం చేస్తే.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబుకు కూడా పాలన చేతకాదనే అనాలి.
ఎందుకంటే.. ఆయన పాలనలోనూ అనేక కేసుల్లో తీర్పులు వ్యతిరేకంగానే వచ్చాయి. ఆయన చేయాలనుకున్న పనులకు న్యాయవ్యవస్థ తనదైన శైలిలో బ్రేకులు వేసింది. అందుకే అప్పట్లో ఓ సందర్భంలో సీఎంగా చంద్రబాబు.. `ప్రజలకు మంచి చేయాలంటే.. కోర్టులకు వెళ్లి పిశాచాల్లా అడ్డు పడుతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరమా? “ అని ప్రశ్నించారు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు సంబంధించిన అమర రాజా సంస్థకు అనుకూలంగా హైకోర్టు కొంత ఉపశమనం (తీర్పుకాదు) కల్పించింది. ‘అమర రాజా’ కంపెనీకి కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.