అదేం చిత్రమో తెలియదు కానీ.. అప్పటి వరకు సీళ్లు వేసుకున్నట్టుగా ఉండే నోళ్లు హఠాత్తుగా ఓపెన్ అవుతాయి. ఏపీ సీఎంగా జగన్.. ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభిస్తే.. చాలు.. `ఇది పాత పథకమే! దీనికి కొత్తగా రంగేశారు` అంటూ.. చంద్రబాబు అనుకూల వర్గం.. ప్రచారానికి దిగిపోతుంది. “దీన్ని మేం ఎప్పుడో అమలు చేశాం. ఇది మాదే. మమ్మల్ని కాపీ కొట్టారు!“ అంటూ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చేస్తారు. ఇక, తమ్ముళ్లు దాన్ని పీక్‌కు తీసుకువెళ్తారు. దీంతో సదరు పథకంపై చర్చకన్నా..కూడా.. చంద్రబాబు వ్యూహంపైనే చర్చ ఎక్కువగా నడుస్తుంది.
అయితే, ఇక్కడే అసలు విషయం ఒకటి ఉంది. సదరు పథకాన్ని చంద్రబాబు తన పాలనలో అంత ఘనంగా అమలు చేసి ఉంటే.. ఓటమి ఎందుకు ఎదురైందనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పేవారు ఒక్కరూ ఉండరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు తెరమీదికి వచ్చిందంటే.. దాదాపు రు. 650 కోట్లతో విద్యార్థులకు `జగనన్న విద్యా కానుక“ పథకాన్ని సీఎం జగన్ ఈ రోజు ప్రారంభిస్తున్నారు. నిజానికి ఇది ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. విద్యార్థులకు సకలం అందించడంతోపాటు వారి తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడకుండా చూడాలనే లక్ష్యంతో జగన్ ఏర్పాటు చేసుకున్న కీలక పథకం.
అయితే, ఇందులోనూ చంద్రబాబు పొలిటికల్ పిడకల వేట ప్రారంభించారు. తన వర్గాన్ని రంగంలోకి దింపారు. “ఇది పాత పథకమే.. కొత్తగా కనికట్టు కట్టేసి.. జగన్ జనాల్ని బురిడీ కొట్టిస్తున్నాడు“ అంటూ ప్రచారం ప్రారంభమైంది. నిజమే! ఇది పాత పథకమే కావొచ్చు. మరి దానికి ఏం పేరుంది? ఎలా అమలు చేశారు? ఎన్ని కోట్లు ఖర్చు చేశారు? అది మాత్రం వెల్లడించలేదు. అప్పటి రికార్డులు తిరగేస్తే.. బాబుగారి బండారం బయట పడక మానదని అంటున్నారు పరిశీలకులు. యూనిఫాం ఇచ్చారు. చాలీచాలని దుస్తులు.. చేతులు ఉంటే.. జేబులు లేవు, నిక్కర్లకు బొత్తాలు లేవు.
ఇక, బాలికలకైతే.. స్కర్ట్‌లు ఎంత దారుణంగా కుట్టారో.. చూసి.. దాదాపు 50 వేల పీసులను వెనక్కి పంపారు. ఇప్పటికీ అవేమయ్యాయో తెలియదు. విద్యా సంవత్సరం గడిచి.. ఎన్నికలు కూడా వచ్చాయి. ఇక, బ్యాగులు ఇచ్చామని చెబుతున్నారు. ఎవరికి ఇచ్చారో మాత్రం చెప్పడం లేదు. షూ ఇచ్చామని, సాక్స్‌లు ఇచ్చామని అంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. కేవలం మోడల్ స్కూళ్లలో మాత్రమే షూ ఇచ్చినా.. అది కూడా చాలా స్కూళ్లలో విద్యార్థుల సైజుకు తగ్గట్టు ఇవ్వకపోవడంతో వెనక్కి పంపారు. దాదాపు 100 కోట్ల నిధులు ఏమయ్యాయని..అప్పటి పీఏసీ చైర్మన్‌గా ఉన్న బుగ్గన ప్రశ్నిస్తే.. వెటకారంగా మాట్లాడారు.
ఇక, తమ హయాంలో విద్యార్థినులకు సైకిళ్లు పంచామని.. ఇప్పుడు చాలా చోట్ల తుప్పుపడుతున్నాయని.. వాటిని పంచాలని డిమాండ్ చేయడం బాబుకే చెల్లింది. నిజానికి దీనిలో పెద్ద వింత చోటు చేసుకుంది. ఎన్నికలకు ముందు వీటిని పంపిణీ చేయాలని చంద్రబాబు భావించారు. ఫిబ్రవరిలోనే వీటిని తయారు చేయాలని ఆర్డర్లు వెళ్లాయి. కానీ.. తమ్ముళ్లకు కంపెనీకి మధ్య బేరం కుదరక ఆలస్యమై.. ఎన్నికలకు వారం ముందు చేరుకున్నాయి. అప్పటికే కోడ్ వచ్చేసింది. దీంతో అవి మూలనపడ్డాయి. ఇదీ బాబు నైజం.. పెట్టే ఉద్దేశం ఉంటే.. ఎన్నికల వరకు ఎందుకు వెయిట్ చేయాలి? అనే ప్రశ్నకు వారి నుంచి సమాధానం లేదు. ఏదేమైనా.. చేస్తున్న పనిని తమ ఖాతాలో వేసుకోవడం తప్ప.. బాబుకు ఏమీ కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash