ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నిన్న జరిగిన చంద్రబాబు విశాఖ పర్యటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రబాబు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ.. బాబుకు స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు వైసీపీ శ్రేణులు బాబు పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. వైసీపీ కార్యకర్తలు బాబు కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. చంద్రబాబు గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఇలా దాదాపు ఐదు గంటల హైడ్రామా అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ విశాఖ పర్యటనకు వెళ్లకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారవుతుందని.. ఇలా ఎన్నిసార్లు ఆటంకాలు సృష్టిస్తారో నేనూ చూస్తానన్నారు చంద్రబాబు. అనుమతి తీసుకున్న పర్యటనను అడ్డుకోవడం ఏమిటని, వైసీపీ శ్రేణుల తీరు చూస్తుంటే పోలీసుల పరోక్ష సహకారం ఉందని ఆరోపించారు. కాగా, నిన్నటి వ్యవహారంపై టీడీపీ నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.