రాజధాని కట్టని ప్రభుత్వానికి భూములు అమ్మే హక్కెక్కడిది? అమరావతిని స్మశానం అని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్ముతుంది..? అని నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా.. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకిస్తారా..? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో పన్నుల వాతలు.. పథకాలకు కోతలు అని… అమ్మఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గించారన్నారు.
ఒంటరి మహిళల పెన్షన్ అర్హత వయసుని 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం దారుణమని.. నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనమని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. డబ్బులు పంచినా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు పెరగలేదని.. డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా వైసీపీకి ఓట్లు పెరగలేదని ఆగ్రహించారు.
గత ఎన్నికలకు, ఉప ఎన్నికలకు చూస్తే కనీసం వైసీపీకి 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదని.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని విమర్శించారు. పంటల బీమా సాయంలో అసలైన రైతులకు లబ్ధి జరగడం లేదు… నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళితుడైన నారాయణ పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.