టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్క కేసులోనూ అరెస్టు కాలేదు. రిమాండ్‌కు వెళ్లలేదు. తాజాగా స్కిల్ డెవెలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు కావడంతో పాటు రిమాండ్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే.. ఏసీబీ కోర్టు తీర్పు తర్వాత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరో 10 నిమిషాల్లో ఇది ఉంటుందని జనసేన ప్రకటించింది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్, తన పట్ల పోలీసుల తీరు తదితర అంశాలపై జనసేనాని స్పందించనున్నారు. ఇదిలా ఉంటే.. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల ఎస్పీలకు పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎవరూ రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టకుండా అవసరమైన చోట 144 సెక్షన్ అమలు చేయాలని సూచించింది.