టీడీపీ అధినేత , ఏపీ విపక్ష నేత చంద్రబాబు మరో రాజకీయానికి తెరదీశారు. తాజాగా అమరావతిపై సమరంలో భాగంగా ఆయన జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రండి చూసుకుందాం. మీరో నేనో! అనేశారు. మూడు రాజధానుల అంశాన్ని రిఫరెండంగా పెట్టుకుని ఎన్నికలకు వెళ్దామని ఆయన అన్నారు. ఈక్రమంలోనే జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందుకు రావాలని, రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్లి గెలిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుని ఇక, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేశారు.
నిజానికి చంద్రబాబు ఇప్పటికే రాజధాని పై అనేక అస్త్రాలు ప్రయోగించారు. రైతుల ఉద్యమం అన్నారు. తర్వాత పెట్టుబడులు పోతాయని చెప్పారు. జోలెపట్టిభిక్షాటన చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీల నివేదికలను ఆయన భోగి మంటల్లో వేసి తగలబెట్టేశారు. అదేసమయంలో కేంద్రం ఏమైనా జోక్యం చేసుకుంటుందేమోనని మోదీ, అమిత్ షా మాస్కులతోనూ పరోక్షంగా రాజకీయం నడిపించారు. అయితే, ఎంత గింజుకున్నా అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కడా ఒక్క అడుగు ముందుకు వేయలేదు. బాబుకు అనుకూల సంకేతాలు ఎక్కడి నుంచి కూడా రాలేదు.
ఈ క్రమంలోనే ఆయన అన్ని పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఇది కొంతమేరకు సక్సెస్ అయినా.. ఎవరి వాదన వారిది. ఎవరికి రాజకీయ లబ్ధి వారిది.. మొత్తంగా చూసుకుంటే.. పెద్దగాకలిసి వచ్చిన అంశాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్నిఉద్రుతం చేస్తున్నామని చెబుతున్నా.. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తున్నా.. బాబు ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఈ క్రమంలోనే ఆఖరి అస్త్రంగాఆయన రిఫరెండం అనే వాదనను తెరమీదికి తెచ్చారు. ఏకంగా తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని కూడా ప్రకటించారు. నిజానికి చంద్రబాబు రాజకీయ జీవితంలో జోలెపట్టడం ఎలా ప్రథమమో.. ఇప్పుడు రిఫరెండం రాజకీయం చేయడం కూడా అలానే తొలిసారి అంటున్నారు పరిశీలకులు. గతంలో ప్రత్యేక హోదా విషయంలో జగన్ కూడా ఇలానే చంద్రబాబును ప్రశ్నించారు. రండి ఎన్నికలకు వెళ్దాం.. అన్నారు.
అయితే, అప్పట్లో 2014లోనే ప్రజలు రిఫరెండం ఇచ్చారని, తమకుఅ నుభవం ఉంది కాబట్టే ప్రజలు గద్దెనెక్కించారని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు ఎన్నికలు జరిగి 10 నెలలు కూడా పట్టుమని తిరగకుండానే అప్పుడే రిఫరెండం కోరడం ఏమేరకు న్యాయమో.. ఎలాంటి రాజకీయమో ఆలోచించుకోవాలి అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. చంద్రబాబు ఆఖరి అస్త్రంపై అధికార పక్షం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.