తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ కి లేఖ రాశారు.చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసు విచారణలో జాప్యం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబసభ్యులు కోరారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు బాధితుల వినతి పై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.కీలక సాక్షి అయిన సతీష్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారని తెలిపారు.
ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ దాడిచేసి అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. అడ్డుకున్న మాజీ మేయర్ హేమలత పై దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసు చర్యలను నిరసించిన ఆమెపై పోలీసు జీపు ఎక్కించారని లేఖలో ఫిర్యాదు చేశారు. పైగా పోలీసు జీపు డ్రైవర్ పై దాడి జరిగిందని ఆయనని ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. పూర్ణ పై అక్రమ కేసు బనాయించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, టిడిపి నాయకులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.