‘సైరాట్’ సినిమా నటుడిపై చీటింగ్ కేసు నమోదైంది. ఆ చిత్రంలో ప్రిన్స్ దాదాగా నటించిన సూరజ్ పవార్‌పై మహారాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా అతడిని త్వరలోనే విచారించనున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు సెప్టెంబర్ 9న అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులు కలిసి.. సచివాలయం ఫేక్ ఆర్డర్లు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి మూడు ఫోర్జరీ చేసిన జాయినింగ్ ఆర్డర్లు, స్టాంపులు, సీల్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అయితే విచారణలో భాగంగా నిందితులు.. తాము నకిలీ స్టాంపులు, సీల్లు తయారు చేయాడానికి సూరజ్ పవార్ సహాయం చేశాడని చెప్పారని పోలీసులు తెలిపారు. సినిమా కోసం స్టాంపులు కావాలని నిందితులు వాటిని తయారు చేయించుకున్నట్లు వెల్లడించారు. అయితే దొరికిన సాక్ష్యాల ఆధారంగా.. సూరజ్ పవార్ ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా అతణ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తామని అన్నారు.