దేశంలో మాదకద్రవ్యాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం ఆశించిన మేర కనిపించడం లేదు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి వస్తున్న మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం సంబంధిత కస్టమ్స్ అధికారులను ఆదేశించింది.
ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు జల్లెడ పడుతున్నారు.అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు,కంటైనర్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.తాజాగా శుక్రవారం తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు. కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న రూ.110 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను అధికారులు గుర్తించారు. చెన్నై పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు ఓ ముఠా ఈ డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.