చెన్నై టెస్ట్ టీమిండియా చేజారినట్టేనా

-

చెన్నై టెస్టులో టీమిండియా పోరాడుతోంది. మూడోరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. పుజారా, పంత్‌ మినహా ఎవరూ రాణించలేదు. టాప్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా అవుట్‌ కాగా.. అశ్విన్‌, సుందర్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఫాలో ఆన్‌ తప్పించుకోవాలంటే కోహ్లీసేన.. ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది.

చెన్నై టెస్టులో ఇంగ్లండ్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. రిషబ్‌ పంత్‌, ఛటేశ్వర పుజారా ఆదుకోకపోతే.. టీమిండియా పరిస్థితి ఘెరంగా ఉండేది. వీరిద్దరి బ్యాటింగ్‌ కారణంగా.. భారతజట్టు కోలుకుంది. ముఖ్యంగా పంత్‌ కౌంటర్‌ అటాక్‌తో.. అభిమానుల్ని అలరించాడు. 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. 8 వికెట్ల నష్టానికి 555 స్కోరుతో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లాండ్‌ 578 పరుగులకు ఆలౌటైంది. మరో 23 పరుగులు చేసి ఆఖరి రెండు వికెట్లు కోల్పోయింది. బుమ్రా, అశ్విన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియాకు.. ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 6 పరుగులు మాత్రమే చేసి ఆర్చర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు రోహిత్‌. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌..మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. అయితే 29 పరుగులు చేసి ఆర్చర్‌ బౌలింగ్‌లోనే గిల్‌ వెనుదిరిగాడు. కోహ్లి, రహానే కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. దీంతో టీమిండియా 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌.. ఎక్కడా తగ్గలేదు. స్పిన్నర్లను టార్గెట్‌గా చేసుకుని సిక్సర్లతో అలరించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 119 పరుగులు జోడించారు. ఈ తరుణంలో..పుజారా దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాడు. 73 పరుగులు చేసి అవుటయ్యాడు. పుజారా అవుటైన పంత్‌.. తన సహజశైలిలో రెచ్చిపోయాడు. సెంచరీకి సమీపిస్తున్నా.. స్లోగా ఆడే ప్రయత్నం చేయలేదు. 91 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్‌తో కలిసి సుందర్‌ మరో వికెట్ పడకుండా ఆఖరి సెషన్‌ను ముగించారు. ఇంగ్లండ్‌ కంటే కోహ్లీసేన ఇంకా 321 పరుగుల వెనుకంజలో ఉంది. మరో 122 పరుగులు చేస్తేనా.. ఫాలో ఆన్‌ గండం నుంచి టీమిండియా గట్టెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news