స్థానిక ఎన్నికల వేళ ఏపీ ఆర్ధికశాఖకి కొత్త టెన్షన్

-

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై రాజకీయ పార్టీలు ఎంతగా ఫోకస్ పెట్టాయో.. అంతకు మించిన ఉత్కంఠ ఏపీ ఆర్థిక శాఖలో కన్పిస్తోంది.ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఆర్ధిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఏకగ్రీవాలను ఆర్ధిక శాఖ అధికారులు ఎందుకంత నిశితంగా గమనిస్తున్నారు..రాజకీయాలతో ఆర్థిక శాఖ లింక్ పై కాస్త లోతుల్లోకి వెళ్తే ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

పంచాయతీ ఎన్నికలతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ఉప సంహరణ తేదీ అయిపోయింది. ఇక రెండో విడత ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గరపడింది. ఇంకా మరో రెండు విడతల ఎన్నికల ప్రక్రియ జరగనుంది. గ్రామాల్లో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి.. ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి.. ఈ అంశాల్ని రాజకీయా పార్టీలు, ఎస్ఈసీ, ఆయా జిల్లాల యంత్రాంగాలు.. ఎంత వరకు పర్యవేక్షిస్తున్నాయో కానీ సచివాలయంలోని ఆర్థిక శాఖ వర్గాలు మాత్రం సదురు వ్యవహరాలపై ఫుల్ ఫోకస్ పెట్టాయట.

గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గకుండా ఏకగ్రీవాలైతే.. వాటికి జీవో ప్రకారం నిధులను, నజరానాలను సమకూర్చాల్సింది ఆర్థిక శాఖే. అందుకే ఏకగ్రీవాలు.. ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోవాల్సిన అవసరం తమకే ఎక్కువ ఉంటుందంటున్నాయట ఆర్థిక శాఖ వర్గాలు. ప్రస్తుతం ఏపీలో 13 వేలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవాలు చేసుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోంది.

రెండు వేల జనాభాలోపు ఉన్న గ్రామాలు ఏకగ్రీవమైతే.. 5 లక్షలు.. రెండు వేల నుంచి 5 వేల జనాభా ఉంటే 10 లక్షలు, 5 వేల నుంచి పది వేల జనాభా ఉంటే.. 15 లక్షల రూపాయలు.. ఇక 10 వేలకు పైబడి జనాభా ఉన్న గ్రామాలకు 20 లక్షల రూపాయల మేర నజరానాలు ప్రకటించింది ప్రభుత్వం. సీఎం ఆదేశాల మేరకు కనీసం 60 శాతం మేర గ్రామాలనైనా ఏకగ్రీవం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ప్రభుత్వం.. అధికార పార్టీ అనుకున్న విధంగా జరిగితే తమ నెత్తిన పిడుగు పడినట్టే అంటున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు.

ఏపీలో 13 వేల గ్రామాలకుగాను 50 శాతం ఏకగ్రీవాలైతే.. 700 నుంచి 800 కోట్ల రూపాయల నిధులను నజరానాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కోసం 600 కోట్ల రూపాయల మేర ఖర్చు పెడుతున్నామని.. ఇప్పుడు ఏకగ్రీవాల పేరుతో మరో ఎడెనిమిది వందల కోట్లు ఎక్కడి నుంచి తేవాలని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల చెల్లింపులు.. వాటిపై వడ్డీలకే సుమారు 30 వేల నుంచి 35 వేల కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయని ఆర్థిక శాఖ చెబుతోంది.

ఈ క్రమంలో ఏకగ్రీవాల కోసం మరో ఎడెనిమిది వందల కోట్ల రూపాయల ఖర్చంటేనే వామ్మో..అంటున్నారు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు. ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చు ఎలాగూ అవుతుంది..ఇక ఏకగ్రీవాల పేరుతో మరిన్ని నిధులు ఇవ్వడం ఎలా అని ఆలోచిస్తున్నారు అధికారులు. అందుకే గ్రామాల్లో జరిగే ఏకగ్రీవ రాజకీయాల గురించి ఆర్థిక శాఖలో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news