నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూర్( ఎన్సీఆర్బీ) విస్తూ పోయే నిజాలను బహిర్గతం చేసింది. దేశంలో చిన్నారుల ఆత్మహత్యలు పెరిగనట్లు వెల్లడించింది. రోజుకు 31 మంది చిన్నారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. అంటే సగటున దేశంలో ప్రతీ గంటకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2020 లో దేశంలో మొత్తంలో 11396 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది అంతకు ముందు ఏడాది 2019 కన్నా 18 శాతం ఎక్కువ. 2019 లో 9613 మంది చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో ఇది 9413 గా ఉంది. కుటుంబ సమస్యలు, అనారోగ్యం, లవ్ ఎఫైర్ల వల్ల 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సున్న పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు నివేదిక వెల్లడించింది.
ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో ఆత్మహత్యలు ఎక్కవగా నమోదయ్యాయని మానసిక నిపుణులు తెలిపారు. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటం, సామాజికంగా ఒంటరితనాన్ని అనుభవించడంతో పిల్లలు మానసికంగా ఒత్తడికి గురైనట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కాకుండా పిల్లలు చదువులు, పరీక్షల భయాలను కూడా ఎదుర్కొంటున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటిని తొలగించాలంటే పాఠశాలల్లో మానసిక సమస్యల లక్షణాలను గుర్తించడంలో ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందాలి. అంతే కాకుండా, విద్యార్థుల సమస్యలను గోప్యంగా పరిష్కరించడంలో సహాయపడటానికి విద్యాసంస్థలు తప్పనిసరిగా మానసిక కౌన్సెలింగ్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉండాలన్నారు.