ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ల యుద్ధం ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటే.. మరోవైపు చైనా, తైవాన్‌లు యుద్ధానికి సిద్ధమవ్వడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత పెరుగుతున్నాయి. డ్రాగన్ కవ్వింపు చర్యలతో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
‘జాయింట్ స్వోర్డ్’ పేరుతో తైవాన్ చూట్టూ మూడు రోజుల పాటు భారీ స్థాయిలో చేపట్టిన సైనిక విన్యాసాలను సోమవారంతో ముగించిన చైనా.. తాము యుద్ధానికి సిద్ధమని ప్రకటించింది. ‘‘’యుద్ధం ఏ క్షణంలో మొదలైనా పోరాడేందుకు మా బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ‘తైవాన్ స్వాతంత్య్రం’ కోసం జరిగే ప్రయత్నాలతో పాటు అందులో విదేశాల జోక్యాన్ని తుత్తినీయలు చేస్తాం’’’ అని చైనా సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా విన్యాసాల్లో చైనా నౌకాదళానికి చెందిన విమాన వాహకనౌకల నుంచి జె-15 యుద్ధ విమానాలు ఎగిరి తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. తైవాన్‌ను చుట్టుముట్టి దాడి చేసే సన్నాహాల్లో భాగంగానే వాటిని విన్యాసాల్లో డ్రాగన్ వినియోగించిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరోవైపు- తాజా పరిణామాలపై తైవాన్ రక్షణ శాఖ స్పందించింది. వివాదాలు తలెత్తకుండా, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకే తాము ఓర్పుతో వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది.