భారత్​తో యుద్ధానికి సిద్ధమేనా.. చైనా ఆర్మీతో జిన్​పింగ్​

-

ఇండియా- చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్‌ యుద్ధానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)తో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ ‘యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’అని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. పీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుంచి ఆర్మీ జవాన్లతో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ..యుద్ధ సన్నద్ధతపై వారిని ప్రశ్నించినట్లు అక్కడి అధికార మీడియా వెల్లడించింది.

సరిహద్దులో పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు తెలిపింది. ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, దానివల్ల ఆర్మీకి ఎదురవుతున్న సవాళ్లను అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాన్ని 24 గంటల పాటు కంటికి రెప్పలా కాపాడుతున్నామని, కట్టుదిట్టంగా భద్రతను పర్యవేక్షిస్తున్నామని ఆర్మీ జవాన్లు జిన్‌పింగ్‌కు చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

అత్యంత క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లను జిన్‌పింగ్‌ అభినందించారు. తాజా ఆహారపదార్థాలు అందుతున్నాయో లేదోనని వాకబు చేశారు. వారందరినీ సరిహద్దు రక్షకులుగా అభివర్ణించిన ఆయన.. వారిలో నూతన ఉత్తేజం కలిగేలా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news