చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంక దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే లంక అధికారులు ఆ నౌక రాకను వాయిదా వేయాలని కోరారు. ఆ మాటలను చైనా వినిపించుకోవడంలేదు. అసలు ఈ నౌకను శ్రీలంకలోని హంబన్ టొట రేవులో లంగర్ వేసేందుకు తొలుత అనుమతి ఇవ్వడంపైనే భారత్ తీవ్రంగా స్పందించింది.
దీంతో వెనక్కి తగ్గిన లంక.. యువాన్ వాంగ్ 5 ప్రయాణం వాయిదా వేయాలని డ్రాగన్‌ను కోరింది. ఈ నౌక ఇండోనేషియాకు ఉత్తర దిశగా గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ రకంగా అయితే గురువారం ఉదయం 9.30 గంటలకు హంబన్‌టొట రేవుకు ఇది చేరుకొంటోంది.
భారత్ నుంచి శ్రీలంక అధికారులపై నిన్న తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో వారు నిన్న కూడా చైనా దౌత్య అధికారులను పిలిపించి ఆ నౌక ప్రయాణాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో చైనా అధికారులు భారత్ పేరు ప్రస్తావించకుండా ఓ ప్రకటన జారీ చేశారు. చైనా పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చూడాలని కోరారు. శ్రీలంక-చైనా మధ్య సాధారణ సహకారాన్ని దెబ్బతీయవద్దని కోరారు.
ఈ యుద్ధ నౌక సాయంతో భారత్ క్షిపణి పరీక్షలను చైనా పరిశీలించి సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ‘యువాన్ వాంగ్ 5’ క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. కల్పకం, కూడంకుళం సహా అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్నీ సేకరించగలదు.