గోవా టు ఏపీ..వయా చిత్తూరు జిల్లా..దర్జాగా వెళ్లిపోతోంది నకిలీ మద్యం.. కొన్నేళ్ళుగా ఈ రాకెట్ గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతోంది. గుట్టు ఎప్పటికైనా రట్టు కావాల్సిందే అన్నట్లు..నకిలీ మద్యం నలుగురికీ తెలిసిపోయింది. సీన్‌లోకి ఎంటరైనా పోలీసులు.. ఈ ముఠా ఆట కట్టించారు. లిక్కర్ డాన్‌ను అరెస్ట్ చేశారు.
నిందితుడు రాజన్ లిక్కర్ డాన్ మాత్రమే కాదు.. ప్లాష్ బ్యాక్‌లో ఆర్మీలో పని చేసిన వ్యక్తి.. ఈ విషయం తెలిసి పోలీసులే షాకయ్యారు. అంతేనా.. అతడి వద్ద నుంచి లక్షలు విలువ చేసే ఖరీదైన నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజన్..లిక్కర్ సామ్రాజ్యంలో కింగ్ పిన్. భారత ఆర్మీ లో హవల్దార్ గా పని చేసి 2000 ఏడాదిలో రిటైరయ్యాడు. అప్పటి నుంచి ఈ నకిలీ మద్యం దందా లో అడుగు పెట్టాడు. ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మిలిటరీ మద్యం పేరిట నకిలీ మద్యం తయారు చేయడం మొదలుపెట్టాడు. గోవా కేంద్రంగా ఓ పెద్ద రాకెట్ ని నిర్వహిస్తున్నాడు. మద్యం తయారీ కి సంబంధించిన అన్ని రకాల ముడిసరుకులు సిద్ధం చేసుకొని సొంతంగా మద్యం తయారు చేస్తాడు.
గోవాలో లభించే ప్రముఖ బ్రాండ్ లేబుల్స్ సొంతంగా తయారు చేసి బాటిళ్లపై ముద్రించడం మొదలుపెట్టాడు. ఇక అక్కడి నుంచి వ్యాపారాన్ని విస్తరించాడు. గోవా నుంచి ఏపీలోకి..కర్ణాటకలో కి ఈ నకిలీ మద్యం సరఫరా చేసేవాడు. వీరికి చిత్తూరు సెంటర్ పాయింట్‌గా మారింది. ఖరీదైన మద్యం..పైగా మిలిటరీ సరుకు..ఎవరైనా వదులుతారా ఏంటి..అందుకే రాజన్ తయారు చేసే మద్యానికి ఫుల్లు డిమాండ్. సమాచారం అందుకున్న పోలీసులు రాజన్ సీక్రెట్ లిక్కర్ బిజినెస్‌పై కన్నేశారు. ఆకస్మికంగా దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.