స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ ను విధించింది. చంద్రబాబుకు 14 రోజులు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో టీడీపీ రేపు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించగా.. ఆయనను కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు బాబు తరఫు లాయర్లు కోర్టులో 2 పిటిషన్లు వేశారు. అందులో ఒకటి బెయిల్ పిటిషన్. మరొకటి బెయిల్ వచ్చేవరకు ఆయనను హౌస్ అరెస్ట్ కానీ.. ప్రత్యేక జైలుకు తరలించాలని వేసిన పిటిషన్. ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని ఇంటి భోజనంతోపాటు మందులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కోర్టు తీర్పుతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. జాతీయ రహదారులపై ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నాయి.
జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. జైలుకు తరలించకుండా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని లేదా కేంద్ర కారాగారానికి తరలించినట్టు అయితే అక్కడ ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించాలని ఒక పిటిషన్, చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఇంటి భోజనం, మందులు తీసుకునేందుకు అనుమతించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు చంద్రబాబును విచారించేందుకు వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ కూడా పిటిషన్ దాఖలు చేసింది.