BREAKING : సరోగసి వివాదంలో నయనతార దంపతులకు క్లీన్ చీట్

-

పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులమయ్యామంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు నయనతార-విఘ్నేశ్ శివన్. సరోగసి విధానంలోనే పిల్లలకు జన్మనిచ్చారంటూ సోషల్‌మీడియాలో దుమారం రేగింది. ఇండియాలో సరోగసి విధానంపై నిషేధం ఉందని.. అలాంటప్పుడు వీరిద్దరూ ఎలా పిల్లల్ని కన్నారంటూ పలువురు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం నయన్‌ దంపతుల నుంచి వివరణ కోరింది.

నయన్‌ దంపతులు ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు అక్కడి పత్రికల్లో వార్తలు వచ్చాయి. తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందని చెబుతూ వివాహ నమోదు ధ్రువపత్రాన్ని అఫిడవిట్‌కు జతచేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారమే గతేడాది డిసెంబర్‌లోనే తాము సరోగసి కోసం రిజిస్టర్‌ చేసుకున్నామని అందులో పేర్కొన్నారట. యూఏఈలో ఉంటోన్న నయన్‌ బంధువు ద్వారా సరోగసి పద్ధతిలో పిల్లలను పొందామని వివరణ ఇచ్చినట్లు వార్తలు బయటకు వచ్చాయి.

సరోగసీ వివాదంలో భాగంగా తమిళనాడు సర్కార్.. విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై కమిటీ విచారణ పూర్తైంది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నయనతార, విఘ్నేశ్‌ దంపతుల సరోగసీ వ్యవహారం చట్టబద్ధంగానే జరిగినట్లు నివేదిక క్లీన్ చీట్ ఇచ్చింది.

చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో సరోగసీ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని విచారించినట్లు తెలిపారు. సరోగసి ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలు ఫాలో అయ్యారని విచారణలో తేలింది. ఇక అద్దె గర్భం దాల్చిన సదరు మహిళకు వివాహమైందని కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది.

ఇక 2016 మార్చి 11న నయనతార, విఘ్నేశ్‌ దంపతులకు వివాహం అయినట్లు అఫిడవిట్‌లో తెలిపిన విషయం విదితమే. సరోగసి ప్రక్రియ 2021 ఆగస్టులో మొదలైందని అధికారులు పేర్కొన్నారు. 2021 నవంబర్‌లో సరోగసి విధానంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. గత కొన్ని రోజులుగా నయనతార, విఘ్నేశ్‌ జంటపై వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది.

Read more RELATED
Recommended to you

Latest news