యువతిపై విలనిజం చూపిస్తూ వేధింపుల వీడియో.. రంగంలోకి దిగిన సీఎం..

దేశంలో మహిళలు, యువతులపై వేధింపులు, చిత్ర హింసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఓ గిరిజన విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా హింసించాడు. కాళ్లతో తన్నుతూ వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి సీఎం వరకు వెళ్లింది. దీంతో యువకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. వివరాల ప్రకారం.. జార్ఖండ్‌ రాష్ట్రంలో స్కూల్‌ యూనిఫామ్‌లో ఉన్న గిరిజన అమ్మాయిని ఓ యువకుడు దారుణంగా కొడుతూ, కాళ్లతో తంతుంటే.. అతని స్నేహితులు వీడియోలు తీశారు.

Boy Kicking Tribal Girl At Jharkhand - Sakshi

అనంతరం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గిరిజన బాలికపై దాడి జరిగిన వీడియోని రజనీ ముర్ము అనే సామాజికవేత్త ట్విట్టర్‌ హ్యాండిల్ ద్వారా ట్వీట్‌ చేశారు. దీంతో ఈ వీడియో సీఎం హేమంత్‌ సోరేన్‌కు చేరింది. ఈ వీడియో ద్వారా స్కూల్‌ డ్రెస్‌ ఆధారంగా ఆ అమ్మాయి పాకూర్‌లోని సెయింట్‌ స్టానిస్లాస్‌ హెచ్‌ఎస్‌ హతిమారా పాఠశాలలో చదువుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో దాడి చేసిన యువకుడ్ని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పాకుర్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు ఎస్పీని సీఎం సోరెన్‌ ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. దాడికి పాల్పడిన యువకుడు పాకుర్‌ జిల్లాలోని రోలమారా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.