ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. కడప,చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప జిల్లాలో డ్యామ్ తెగిపోవడం వల్ల పన్నెండు మంది మృతి చెందారు. మరికొంతమంది గల్లంతవ్వగా ఏన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయచర్యలు చేపడుతున్నాయి. ఇక ఇప్పటికే సీఎం సహాయక చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా రేపు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుండి సీఎం కడప చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే తరవాత ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి గన్నవరం చేరకుంటారు. ఏరియల్ సర్వేకు ముందు సీఎం ఆయా జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేస్తారు.