సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటన కొనసాగుతోంది. నేడు పులివెందుల సీఎస్‌ఐ చర్చి క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గోనున్నారు సీఎం జగన్. ప్రార్థనల అనంతరం హెలీకాప్టర్‌లో కడప విమానాశ్రయం చేరుకుంటారు. కడప ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు. అయితే.. ఏపీలో క్రిస్మస్ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారన్నారు జగన్. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం జగన్.
ఇదిలా ఉంటే.. నిన్న ఉదయం ఇడుపులపాయలోని ఘాట్‌లో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఉన్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి పులివెందుల వెళ్లి జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. విజయ హోమ్స్ దగ్గర ఉన్న జంక్షన్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి మరిన్ని అభివృద్ధి పనుల కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.