సీఎం జగన్ నిన్న సామర్లకోట పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ వద్ద వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం కోరుతూ సీఎంకు వినతులు అందించిన విషయం తెలిసిందే. అయితే.. వారి వినతులను స్వీకరించిన సీఎం జగన్ తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారుల అవసరాలకు ఇచ్చే నిమిత్తం శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో 17 మంది బాధితులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతులు మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
దీనిలో భాగంగా ఈరోజు 17 మందికి లక్ష రూపాయలు చొప్పున రూ.17లక్షలు చెక్కులు బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జె.నరసింహ నాయక్, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డా. పి.రాధాకృష్ణ, కలెక్టరేట్ ఏవో జీఎస్ఎస్ శ్రీనివాసు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. శస్త్రచికిత్సల కోసం కొందరు, ఇతర ఆరోగ్య సేవల కోసం మరికొందరు తమకు సహాయం చేయాలని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి చేసిన సహాయానికి లబ్ధిదారులు మనసారా ధన్యవాదాలు తెలిపారు.