రైతులకు మేలు చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం దేశంతోనే పోటీ చేస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలోని మార్పును చూసి ఇతర రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని అన్నారు. ఈ మేరకు మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై.. రైతుల ఖాతాలో పంటల బీమాను జమ చేశారు. 2021 ఖరీఫ్ సీజన్‌లో నష్టపోయిన రైతులకు రూ.2,977 కోట్ల నష్ట పరిహారాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మూడేళ్లలో రైతుల కోసం ప్రభుత్వం రూ.1.28 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అవినీతి పూర్తిగా నిర్మూలిస్తున్నామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షల సాయం అందిస్తున్నామన్నారు. అయితే కోనసీమలో క్రాప్ హాలిడే పేరుతో కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. రైతులకు ధాన్యం సేకరణ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.