అమరావతి: వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్. జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో వెబ్‌ల్యాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అత్యంత పారదర్శక పద్ధతుల్లో ఇది జరగాలి..దీంట్లో అనుసరించాల్సిన విధానాలు, ఎస్‌ఓపీలను తయారు చేయాలని వెల్లడించారు.
రికార్డులను ఎవ్వరూ మార్చలేని విధంగా, టాంపర్ చేయలేని విధంగా చేయాలన్న సీఎం… ఎలక్ట్రానిక్ పద్ధతుల్లోనే కాకుండా, ఫిజికల్ రికార్డులు కూడా తయారుచేయాలని చెప్పారు. ఈ ఫిజికల్ డాక్యుమెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్న సీఎం… సబ్ డివిజన్‌కోసం దరఖాస్తు పెట్టిన వెంటనే సర్వే జరిగేలా చూడాలన్నారు.
ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని.. లంచాలకు తావులేకుండా ఈ వ్యవస్థ నడవాలని ఆదేశించారు. అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలని.. ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలని.. దీనివల్ల స్థానికంగా ఉన్న సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు.
దీనిపై ఓ రోడ్‌మ్యాప్‌ను కూడా తయారు చేయాలని ఆదేశించారు.