తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నేడు సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాంతం ముఖచిత్రం మార్చే క్రమంలో ఇదొక గొప్ప ప్రయత్నం అని పేర్కొన్నారు. జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో అనేక అనుబంధ పరిశ్రమలు వస్తాయని, దాంతో రాయలసీమలో మెరుగైన ఉపాధికి అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
అటు, అదానీ గ్రీన్ ఎనర్జీ, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేస్తున్న పంప్డ్ హైడ్రోస్టోరేజి ప్రాజెక్టులకు కూడా ఎస్ఐపీబీ పచ్చజెండా ఊపింది. మొత్తమ్మీద రూ.23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ స్టీల్ ప్లాంట్ కోసం జేఎస్ డబ్ల్యూ రెండు విడతల్లో రూ.8,800 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. తొలి విడతలో రూ.3,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పరిశ్రమ ద్వారా ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తులు సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.