కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఆమెతో సమావేశమైన జగన్.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. వాటిని త్వరగా విడుదల చేయాలని కోరారు. మోదీ, అమిత్ షాతోనూ జగన్ భేటీ కానున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీ విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, మార్గాని భరత్ తదితరులు స్వాగతం పలికారు.
శుక్రవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు గురించి ప్రస్తావిస్తారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలుసుకుంటారు. విశాఖపట్నంలో మెట్రో రైలు కారిడార్ అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌ను అందజేసే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన.. భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకుంటుందని, ఎన్డీఏ నుంచి బయటికి వస్తుందంటూ వార్తలు వస్తోన్న వేళ.. రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం.