మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని చెబుతున్న వైసిపి అసలు మూడేళ్లుగా విశాఖ నగర అభివృద్ధికి ఏం చేసిందని నిలదీశారు. వైసీపీ పాలనలో రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఏపీలో బంగారం దొరుకుతుంది కానీ.. ఇసుక దొరకడం లేదని, దీనివల్ల కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దొరకాలంటే ఎన్నో షరతులు ఉన్నాయన్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. వైసిపి, టిడిపి 2 కుటుంబ పార్టీలేనని అన్నారు. కేంద్ర పథకాలను క్షేత్రస్థాయికి వెళ్ళనివ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్, లాండ్, ఇసుక, ఎర్రచందనం మాఫియాలు చెలరేగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.