సహకార శాఖ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకుల పై, పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల బలోపేతంపై చర్చించారు. వాటి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం దిశగా చర్చించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, రైతు భరోసా కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేశామన్నారు. ఆర్బీకేలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా డీసీఎంఎస్ పనులు, కార్యక్రమాల పై అధ్యయనం జరగాలన్నారు. ప్రైమరీ, సెకండరీ పుడ్ ప్రాసెసింగ్ వ్యవస్ధలు డీసీఎంఎస్‌ల ద్వారా ఇంటిగ్రేడ్ కావాలని, వీటన్నింటి మీద సమూల అధ్యయనం చేసి చర్యల కోసం తగిన నివేదిక ఇవ్వండని అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా.. ‘జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ప్రొఫెషనలిజం పెంచాం. పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లలో కూడా ప్రొఫెషనలిజం పెంచాల్సిన అవసరం ఉంది. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించే ఎరువులు, మిగిలిన వాటిలో నాణ్యత చాలా ముఖ్యం. కల్తీలకు ఆస్కారం లేకుండా చూడాలి. నవంబర్ నాటికి పీఏసీఎస్‌లలో పూర్తి స్థాయి కంప్యూటరీకరణ. పీఏసీఎస్‌ల కింద నడిచే పెట్రోలు బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషించాలి. కమర్షియల్ బ్యాంకుల కన్నా.. తక్కువ వడ్డీలకే రైతులకు, మహిళలకు వడ్డీలు ఇవ్వాలి.’ అని సీఎం జగన్ అన్నారు.