అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయి : మోదీ

-

కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రకటించాయి. ఇందులో భాగంగా అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైనదనే ఏకాభిప్రాయానికి రావడంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రతిపక్షాలు ఇచ్చాయి. అయితే.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలు మూడ్రోజులుగా ఫీల్డింగ్ చేస్తుంటే తమ వైపు నుండి ఫోర్లు, సిక్సులు పడ్డాయని, అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని అన్నారు. అవిశ్వాసం పెట్టాలని దేవుడే విపక్షాలకు చెప్పాడని, ఇలా పెట్టినందుకు మోదీ వారికి ధన్యవాదాలు చెప్పారు.

విపక్షాల అవిశ్వాసం తమకు శుభసూచకమన్నారు. 2018లోను అవిశ్వాస తీర్మానం పెట్టారని, కానీ ప్రతిపక్షాలకు వారికి ఉన్న సభ్యుల ఓట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈ అవిశ్వాసం తమపై కాదని, విపక్షాల పైనే అన్నారు. 2024లో ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, కానీ విపక్షాలకు మాత్రం అధికార దాహం పెరిగిందన్నారు. పేదల భవిష్యత్తు కంటే విపక్షాలకు అధికారమే ముఖ్యమని విమర్శించారు.

మూడురోజులుగా అవిశ్వాసంపై జరిగిన చర్చ ఆశ్చర్యం కలిగించిందని, విపక్షాలు ఫీల్డింగ్ చేస్తుంటే, తమ వైపు నుండి ఫోర్లు, సిక్స్‌లు పడ్డాయన్నారు. అయిదేళ్లు సమయం ఇచ్చినా విపక్షాలు తమపై సిద్ధం కాలేదని ఎద్దేవా చేశారు. ఈ కాలంలో ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో విఫలమైనట్లు చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని ఆరోపించారు. కానీ వారు ప్రవేశపెట్టిన నో కాన్ఫిడెన్స్ నో బాల్ గా మిగిలిపోయిందన్నారు. చర్చ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా విన్నదన్నారు. అధిర్‌ను ఎందుకు మాట్లాడనివ్వలేదో తనకు అర్థం కాలేదని, బహుశా కోల్ కతా నుండి ఫోన్ వచ్చినట్లుందని చమత్కరించారు.

Read more RELATED
Recommended to you

Latest news