సీఎం జగన్ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై దృష్టి పెట్టాలన్నారు. సమీక్షలో భాగంగా అధికారులు పలు కీలక విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశామని అధికారులు వెల్లడించారు. పోలవరం ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించాలన్నారు. వెలగొండ, వంశధార, అవుకు సహా ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం జగన్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల ప్రగతిని సీఎంకు అధికారులు నివేదించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తికావొచ్చిదని, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. అవుకు ద్వారా 20 వేల క్యూసెక్కుల కృష్ణా వరదజలాలను రాయలసీమకు తరలించవచ్చని తెలిపారు. వరదలు సమయంలో నీరు వృథాగా సముద్రంలో కలవకుండా కరవు ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు.