రాజధాని అంశంపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకొని, చరిత్రలో కనీవినీ ఎరుగని ఉద్యమమైందని తెలిపారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి పరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయకుండా సుప్రీంకోర్టుకి ఎక్కిందని మండిపడ్డారు.
మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ. తాడేపల్లి లో ఇల్లు కట్టుకున్న ఏకైక నేతగా గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రజలని మభ్య పెట్టారని విమర్శించారు. ఉగాది తరువాత విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పిన జగన్ కు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విశాఖలో చుక్కెదురైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మంకుపట్టు వీడి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.