ప్రధాని మోదీ విశాఖలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలోని సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానానికి వచ్చారు. సభా వేదికకు ముందుగానే చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. ప్రధానికి స్వాగతం పలికారు. విశాఖ బహిరంగ సభా వేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోడీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలికారు. దేశ ప్రగతి రథ సారథి పీఎం మోడీ అని ప్రసంగం ప్రారంభించారు. ఉత్తారంధ్ర గడ్డపై ప్రధానికి సాదర స్వాగతం పలికారు.
కార్తీక పౌర్ణమి రోజున ఎగసిపడిన సముద్ర కెరటాలకు మించి, జన సముద్రాన్ని తలపించేలా ప్రజలు తరలివచ్చారని చెప్పారు. గడిచిన మూడున్నరేళ్లల్లో విద్య, వైద్య, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, పారదర్శకత, గడప వద్దకే పరిపాలనే తమ ప్రాధాన్యతలుగా అడుగులు వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించే పరిస్థితి కల్పించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి ముందుకు నడిపించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.