తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో మిషన్ భగీరధ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతీ ఇంటికి తాగు నీరు అందించాలి అనే ఉద్దేశంతో తెలంగాణా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2014 లో కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న తాగు నీటి సమస్యను పరిష్కరించడానికి కెసిఆర్ ఈ ఆలోచన చేసారు. ఎన్నికలకు ముందే దాదాపు అన్ని గ్రామాలకు అందించారు.
ఎన్నికల తర్వాత కొన్ని గ్రామాలకు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఏపీలో తాగు నీటి సమస్య రాయలసీమ గ్రామాల్లో ఎక్కువగా ఉంది. దీనితో దీని అమలు దిశగా అడుగులు వేస్తున్నారు జగన్. అలాగే గుంటూరు ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ సమస్య ఎక్కువైంది. దీనిని అధిగమించాలి అంటే మాత్రం కచ్చితంగా మిషన్ భగీరధను అమలు చెయ్యాలని భావించినట్టు సమాచారం.
ఇప్పటికే ఏపీ లో కంటి వెలుగు కార్యక్రమం అమలు అవుతుంది. తెలంగాణా ప్రభుత్వ స్ఫూర్తి తో ఏపీ సిఎం వైఎస్ జగన్ దీనికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే తెలంగాణా జలవనరుల శాఖను ఏపీ మంత్రులు కలుస్తారని అంటున్నారు. అలాగే కీలక శాఖల అధికారులు కూడా మిషన్ భగీరధ సాధ్యా సాద్యాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉందని, బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో దీనికి నిధులు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.