బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం కార్యచరణ నిర్వహించారు. కరోనా కారణంగా తెలంగాణలో రూ.50 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని, ఈ ఏడాది బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. సమావేశంలో పలు శాఖలు పొందిపర్చిన పద్దులను పరిశీలించారు. శాఖల వారీగా బడ్జెట్ అంచనాలు, ఆర్థిక నివేదికలను పరిశీలించి చూశారు. అయితే కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు. వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, గత బడ్జెట్‌తో పోల్చితే ఈ సారి జరిగే బడ్జెట్ కేటాయింపు ఆశాజనకంగా ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పెంపకం కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా యాదవులు, గొల్ల, కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీంతో మరో 3 లక్షల గొర్రెల యూనిట్లను పెంచే యోచనలో ఉన్నారు. గొర్రెల పంపిణీపై కేంద్రం మెచ్చుకుందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

చేపల పెంపకం కూడా మంచి ఫలితాలు ఇస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి ఈ పథకాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు మార్చి నెలలో రెండో వారం చివరిలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. ఈ రోజు నుంచి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ కార్యచరణ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ, పురపాలక, పంచాయతీ రాజ్, విద్య, సాగునీటి, ఆర్థిక శాఖల అధికారులతో సమావేశమై బడ్జెట్ అంచనాలను నిర్ణయించనున్నారు.