భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సీఎంకే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడంపై అధికారులను అడిగి పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణమే జీహెచ్‌ఎంసీకి రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించా లని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిం చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతేగాక వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రూ.600 కోట్లు, జీహెచ్‌ఎంసీ సహా ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.1,350 కోట్లను తక్షణ సాయంగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాశారు.