తాజాగా మరోసారి తెలంగాణ ముఖ్యంగా కేసీఆర్ రాజకీయంగా జాతీయ స్థాయిలో చర్చకు వచ్చారు. ఆయన గతంలో చేసిన ప్రయోగమే మరోసారి మరో రూపంలో చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణ సాధన సమయంలోను, అంతకుముందు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. తెలంగాణ సాధన సమయంలో కొన్ని చిన్నా చితకా రాజకీయపార్టీలను ఏకం చేసి.. వాటి సమ్మతిని తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అదేసమయంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కూడా గతంలో కేసీఆర్ తనదైన శైలిని అవలంభించారు.
ఇక, తెలంగాణ సాధనతో కేసీఆర్ రాజకీయంగా కీలకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రాష్ట్ర సాధనలో ఎందరో ఉన్నప్పటికీ.. అంతిమంగా ఫలితం మాత్రం కేసీఆర్ ఖాతాలోకే వెళ్లింది. ఇక, రెండు సార్లుగా కేసీఆర్ రాష్ట్రంలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జాతీయ స్థాయిలో రాజకీయాలు నడపాలనేది ఆయన వ్యూహం. గత 2018 తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితరులను ఆయన సమాయత్తం చేసి.. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాగేసుకుంటోందని, కాబట్టి మనమే కేంద్రంలో పాగా వేద్దామని కేసీఆర్ ఓ ఆలోచనను తెరమీదికి తెచ్చారు.
దీనికి కొందరు నాయకులు కూడా కలిసి వచ్చారని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే, తర్వాత ఏమైందో ఏమో ఆయన వెనక్కి తగ్గారు. ఇక, ఇప్పుడు ఏకంగా నవ భారత్ పేరుతో ఓ కొత్త పార్టీ పెట్టాలని, దీనిని జాతీయ రాజకీయాలకు ప్రధానంగా ప్రాధాన్యం ఇచ్చేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, దీనికి సంబంధించి ఎన్నికల సంఘం వద్ద.. రిజిస్టర్ కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయని వార్తలు వచ్చాయి. వాస్తవానికి 2024 వరకు దేశంలో ఎన్నికలు లేవు. అయితే, మధ్యలోనే జమిలి ఎన్నికలు వస్తే.. 2022-23 మధ్యలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
దీనిని పరిగణనలోకి తీసుకునే.. కేసీఆర్ వ్యూహాత్మకంగా జాతీయస్థాయిలో చక్రం తిప్పి.. ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ భావిస్తున్నట్టు.. ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పగలిగే సత్తా ఉన్ననాయకుడేనా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, మహారాష్ట్ర వరకుఓకే అయినా.. ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా హిందీ బెల్ట్‌గా పేరున్న ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేయడం అంత ఈజీ కాదు. ఇక, కొన్ని రాష్ట్రాల్లో పీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఉన్నారు. వారు.. ఎప్పుడు అవకాశం వచ్చినా.. ప్రధాని పదవిని అందుకోవాలని చూస్తుంటారు.
వీరంతా కేసీఆర్‌కు కలిసిరావాలి. పైగా మోడీ సానుకూలతలను దెబ్బకొట్టడం, ఆయన వ్యతిరేకతను కేసీఆర్ తనవైపు తిప్పుకోవడం అంటే.. సాధారణంగా జరిగే పనేనా? అనేది కీలక అంశం. ఏదో.. కేంద్రంలోని మోడీపై కోపంతో పార్టీ పెడుతున్నారనే భావం వ్యక్తమవుతోందే తప్ప.. జాతీయ ప్రయోజనాలు, జాతి ప్రయోజనాలు కనిపించినప్పుడే.. కేసీఆర్ వ్యూహం సక్సెస్ అవుతుందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
– vuyyuru subhash