సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనుల సమీక్షతో పాటు నిజామాబాద్ నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచడం, ప్రజలకు సౌకర్యవంతంగా అన్ని రంగాలను అభివృద్ధి పరిచి నగరాన్నిసుందరంగా తీర్చిదిద్దడం అనే అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి తత్వంతో, సమన్వయంతో పనిచేయడం ద్వారా సాధించే ఫలితాలు సామాజికాభివృద్ధిని వేగవంతం చేస్తాయని, తద్వారా మాత్రమే సమాజంలోని వ్యక్తులుగా సాధించిన ఫలితాల్లో భాగస్వామ్యం అందుకోగలమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఫలితంగా అమలులోకి వచ్చిన స్వయం పాలనలోని ప్రగతి సమిష్టి కృషికి నిదర్శనమని సీఎం స్పష్టం చేశారు.
స్వరాష్ట్రంలో ఒక్కొక్క రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టండంలో ప్రభుత్వ ఉద్యోగుల సమిష్టి కృషి ఇమిడి వున్నదన్నారు. సాధించిన దానికి సంతృప్తి చెంది ఆగిపోకుండా ఇంకా గొప్పగా ఆలోచించాలని సూచించారు సీఎం కేసీఆర్. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించిన నాడే గుణాత్మక ప్రగతిని మరింతగా ప్రజలకు చేరవేయగలుగుతామని
ప్రభుత్వాధికారులకు సీఎం పునరుద్ఘాటించారు. రోటీన్‌గా అందరూ పనిచేస్తరు కానీ మరింత గొప్పగా ఎట్లా పనిచేయాలనేదే ముఖ్యం.
నిన్నటి కన్నా రేపు ఎంత మెరుగ్గా పని చేయగలమని ప్రతిరోజు ఆలోచించాలె. ఒక పనిని ఎంత శాస్త్రీయంగా జీవించి, రసించి, ఆలోచించి చేస్తున్నం అనేదే ముఖ్యం. అప్పుడే ఉన్నతంగా ఎదగగలం. మూస ధోరణులను సాంప్రదాయ పద్దతులలో కాకుండా వినూత్న పద్ధతుల్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు మార్గాలు అన్వేషించాలి. అందుకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాల్సి వుంటుందని అధికారులకు కేసీఆర్ వివరించారు.