హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ శుభవార్తం చెప్పారు. భాగ్యనగరానికి మణిహారమైన మెట్రో రెండో ఫేజ్‌పై అప్డేట్ ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విధితమే. అయితే.. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదే అంశంపై కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. శంషాబాద్ వరకు విస్తరించనున్న మెట్రో పనులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులనే ఖర్చు పెడుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
మూడేండ్లలో ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర రూ. 6,250 కోట్ల వ్యయంతో పనులను చేపట్టనున్నారు. ఇక మరో 31 కిలోమీటర్లకు సంబంధించి మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లు సమర్పించామని పేర్కొన్నారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్‌బీ నగర్ వరకు 5 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలని కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.